జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ దారుణ హత్య ప్రజాస్వామ్య, పత్రికా స్వేచ్ఛ వాదుల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది. జర్నలిస్టుల ప్రజాస్వామ్య హక్కుల వేదిక (జేడీఆర్‌ఎఫ్) ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్, ఈ చర్యను పత్రికా స్వేచ్ఛపై దాడి అని ,హత్యకు గురైన జర్నలిస్టుకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నిజానిజాలను బట్టబయలు చేసే జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు, హింస, హత్యలను ఎత్తిచూపుతూ ప్రజాస్వామ్య పరిస్థితి ఏంటని మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు.

జర్నలిస్టులపై ఇలాంటి దౌర్జన్యాలు ప్రజాస్వామ్యానికి నిదర్శనమా? రాజకీయ రాబందులు మరియు మాఫియా గ్రూపులు తరచుగా అధికారంలో ఉన్న వారి మద్దతుతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ముఖేష్ చంద్రకర్ హత్య అద్దం పడుతుందని పేర్కొన్నాడు.
కార్పొరేట్ మీడియా ప్రభావం జర్నలిస్టుల మధ్య సంఘీభావాన్ని బలహీనపరిచిందని, ఇలాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ఏకం కావాలని శ్రీనివాస్ కోరారు. జర్నలిస్టులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, జర్నలిస్టుల సామూహిక గొంతుకలను అణిచివేస్తే ప్రజాస్వామ్య పాలనకు విధ్వంసం తప్పదని హెచ్చరించారు.