ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ 2025-2026 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో చేసిన కేటాయింపులతో వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగాన్ని ఏమాత్రం రక్షించలేవు. కౌలురైతులను కాపాడలేవు.రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల రైతు,కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన శుక్రవారం రోజున యన్. టి.ఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలోని, కోనయపాలెం గ్రామానికి చెందిన వినుకొల్లు నరసింహారావు (41) అనే కౌలురైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా 2.5.ఎకరాలు పొలంను కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేస్తున్నాడు. నాలుగేళ్ల నుంచి పంటలు సక్రమంగా పండక పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేక అతి చిన్న వయసులోనే బలవన్మరణం చెందాడు.ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా
ఈ 9 నెలల కాలంలోనే 180 మంది రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ భరోసా లేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకోవడానికి ఈ బడ్జెట్ లో ఏ ఒక్క ప్రతిపాదన కూడా లేకపోవడం దురదృష్టకరం.అప్పుల్లో కూరుకుపోయి ఆత్మ స్థైర్యం కోల్పోయిన రైతులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనేది ఈ బడ్జెట్ ను పరిశీలిస్తే అర్థం అవుతుంది. కనీసం బాధిత కుటుంబాలకి ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మంత్రివర్యులుకు లేకపోవడం సిగ్గుచేటు. ఏదో వ్యవసాయ రంగానికి వెలగబెడుతున్నట్లు సమాజాన్ని మభ్యపెట్టటానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్ప మరొకటి కాదు. ఒకవేళ బాగా కేటాయించారని అనుకుందామన్న మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు కేవలం 4.48 శాతం మాత్రమే.62 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అత్యంత కీలకమైన వ్యవసాయ రంగానికి ఈ కేటాయింపులు ఏ మూలకు సరిపోవు.
2023-2024లో వ్యవసాయ, దాని అనుబంధం రంగాలకు రూ.10214 కోట్లు ఖర్చు చేశారు. 2024-2025 ఏడాదిలో రూ.12,534 కోట్లు ప్రతిపాదించారు.ఇది మొత్తం బడ్జెట్లో 4.2శాతం కాగా సవరించిన అంచనాల దగ్గరకు వచ్చేసరికి రూ.6150 కోట్లు అంటే 2.24 శాతం మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ శుక్రవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ,దాని అనుబంధ రంగానికి రూ.14182 కోట్లు (4.40%)కేటాయింపులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఏడాదిలో సవరించిన అంచనాల కంటే రెట్టింపు కేటాయించామని చెప్పటం విడ్డూరంగా ఉంది. కానీ గత అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటే ఎంత కుదిస్తారో తెలియదు.బడ్జెట్ ప్రతిపాదన ఎంత ఘనంగా ఉన్న చివర ఆఖరికి వచ్చేసరికి నికరంగా చేసిన ఖర్చును బట్టి ఆ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో తెలుస్తుంది.అన్నదాత సుఖీభవకు పథకానికి కావాల్సింది రూ.10.717 కోట్లు బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.6,300 కోట్లే. రాష్ట్రంలో ఉన్న కౌలురైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇవ్వటం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే రూ.20వేలు చొప్పున కౌలురైతులకు మరియు అటవీ హక్కుల చట్టం ద్వారా భూములు సాగుచేసే గిరిజన రైతులకు పెట్టుబడి సాయం చెల్లించాలి.
ఈ లెక్కన కేటాయింపులు పరిశిలిస్తే మొత్తంగా 22.08 లక్షల మందికి పెట్టుబడి సాయం అందే అవకాశం లేదు. గత తేడాదిలో రూ.1,000 కోట్లు కేటాయించారు. ఓ వైపు పకృతి వైపరీత్యాలు, మరోవైపు మార్కెట్లో ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో కొంత ఊరటనిస్తుందని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా తొలి ఏడాదికి సంబంధించి ఒక్క పైసా పెట్టుబడి సాయం విదిల్చ లేదు. వాస్తవానికి రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ లబ్దిదారులు 53,58,388 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జమ చేయాలంతే బడ్జెట్లో రూ.10,717 కోట్లు కేటాయించాలి. కానీ కేటాయించింది కేవలం రూ.6,300 కోట్లే కాబట్టి ఈ మొత్తం రూ. 20 వేల చొప్పున అర్హులైన రైతులకు చెల్లిస్తే కేవలం 31.50 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. మిగిలిన వారికి అరచేతిలో వైకుంఠమే. రాష్ట్రంలో పంట రుణాలు రూ.1,50,000 కోట్ల నుండి 1,63000 కోట్ల వరకు తీసుకుంటున్నారు.ఇందులో లక్ష రూపాయల వరకు తీసుకున్న రైతులకు వడ్డీ రాయితీ చెల్లించాలంటే రూ.3,000 కోట్లు కావలసి ఉండగా కేవలం రూ.250 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు.ఎన్నికల సందర్భంగా ధరల స్థిరీకరణనిధికి రూ. 3 వేల కోట్లు కేటాయించి మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు జోక్యం చేసుకొని కొనుగోలు చేయడానికి ఈ నిధిని ఉపయోగిస్తామన్నారు. కానీ కేవలం రూ.300 కోట్లు విదిల్చింది.మిర్చి, పొగాకు,కందులు, శనగలు వేరుశనగ, పెసలు ,ఉల్లిపాయలు, టమోటా తదితర పంటలకు మద్దతు ధరలు దక్కకపోవడంతో అతి తక్కువ ధరకు మార్కెట్లో అమ్ముకొని రైతాంగం నష్టపోతున్నారు. కనీసం వీరిని ఆదుకోవటానికి ప్రయత్నాలు చేయకపోగా డబ్బులు లేవని చేతులెత్తేశారు.
దీన్ని అలుసుగా చూసుకొని వ్యాపారస్తులు సిండికేట్ గా మారీ రైతుల కష్టార్జితాన్ని కాజేస్తుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తున్నది. ప్రకృతి విపత్తులు, చీడపీడల బారిన పడి పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి కేటాయిస్తామని వాగ్దానం చేశారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాల వల్ల వేల కోట్ల రూపాయల నష్టపోయిన రైతాంగానికి రూ.280 కోట్లు ఇచ్చి పండగ చేసుకోమన్నారు. రాష్ట్రంలో 100 మండలాల పైగా కరువు తాండవిస్తుంటే కేవలం 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. ఇంత వరకు ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పంటల భీమా పథకం ఏమైందో తెలియదు.
కనీసం బడ్జెట్లో ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానం మేరకైనా విపత్తుల ఎదుర్కోటానికి ప్రత్యేక సహయనిధి ఏర్పాటు చేయకపోవడం బాధాకరం.విత్తన రాయితీ పథకానికి గతేడాది రూ.268 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది పెంచకపోగా రూ.240 కోట్లకు కుదించారు. భవిష్యత్తులో పంటలు పండించడానికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు రైతులు బయట మార్కెట్లో కొనుక్కోవాల్సిందే. అంటే రాష్ట్ర ప్రభుత్వం రోజురోజుకు సాగు భారాలను పెంచుతుంది తప్ప తగ్గించడం లేదు.గతంతో పోల్చితే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి స్వచ్చంద బీమా నమోదు పథకం తీసుకొచ్చారు.ఈ పథకానికి గత ఏడాదికి రూ.1,028 కోట్లు మాత్రమే కేటాయించారు. రబీ నుండి రైతులపై భారం మోపారు. నేటి బడ్జెట్లో కూడా గతం కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. ఇవే కాకుండా ఎన్టీఆర్ జలసిరికి రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రకృతి వ్యవసాయానికి రూ. 61.78 కోట్లు, ఎరువులు సరఫరాకు రూ.40 కోట్లు భూసార పరీక్ష నిర్మాణకు రూ.38 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఈ అరకొర కేటాయింపులతో వ్యవసాయాన్ని బాగు చేస్తామని ప్రగల్బాలు పలకటం విచిత్రంగా ఉంది.
ఎన్నికల సందర్భంగా కౌలు రైతులకు నూతన కౌలుచట్టం తెస్తామని హామీ ఇచ్చారు.ప్రస్తుతం బడ్జెట్ స్పీచ్ లోని 4పేజీని పరిశీలిస్తే అర్హులైన కౌలురైతులను గుర్తించి వారికి కౌలుహక్కులు కార్డులు జారీ చేసి సులభతరంగా పంటరుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలుచట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది చూసిన వారికి, విన్నవారికి కౌలురైతులకు ఎంతో మేలు చేయబోతున్నట్టుగా వినుసంపుగా ఉంటుంది. చదివిన వారికి మంచి అభిప్రాయం కల్గుతుంది.
ఇవే మాటలు గత బడ్జెట్ సందర్భంగా కూడా ఈ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారే చిలక, పలుకులు పలికారు.ఇంతవరకు అతీలేదు గతి లేదు. గత మూడు సంవత్సరాల క్రితమే హామీలేని పంట రుణాలు ఒక లక్ష నుండి రూ.1,60,000 వరకు తీసుకోవచ్చని “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చింది. హామీలేని పంట రుణాల గురించి పలుదపాలుగా సమీక్షలు చేస్తున్నప్పటికీ కానీ ఏ బ్యాంకు కూడా రుణాలు ఇవ్వటానికి ముందుకు రావడం లేదు. గత రెండు నెలల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ సమీక్ష సమావేశాల సందర్భంగా రూ.1,60,000 నుంచి రూ. 2 లక్షల వరకు హామీలేని పంట రుణాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూడు లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వరకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకి పంటల రుణాలు ఇస్తామని చెప్పారు. వీటి గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతిసారి బడ్జెట్లో చెబుతూనే ఉంటారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు. చట్టం లేదు చుట్టం లేదు అన్ని మాయమాటలు చెప్పి కౌలు రైతులను మోసగిస్తున్నారు.పశుసంవర్ధక శాఖకు గత ఏడాది రూ.1095.71 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.1112 కోట్లు మాత్రమే ప్రతిపాదనలు చేశారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే నిధులు పెరగలేదు. ప్రతి ఏడాది నాలుగు సార్లు గొర్రెలు,మేకలకు నట్టల నివారణ మందులు వేయాలంటే సుమారు రూ.24 కోట్లు ఖర్చు అవుతుంది ఇందులో ఈ నిధుల ప్రతిపాదన లేదు. గొర్రెల మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ కు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక పైసా కూడా కేటాయించ లేదు.దీని వల్ల జీవనోపాదులు పొందటానికి పేదలైన గొర్రెలు,మేకల పెంపకందారులకు అవకాశం లేకుండా పోయింది.
కేంద్రం నుంచి ఇచ్చే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (యన్.సీ.డి.సీ) నిధులకు ఇచ్చే సబ్సిడీ ఈ బడ్జెట్ లో ప్రకటించలేదు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కోటీశ్వరుల పథకంగా మార్చారు.జీవనోపాధి ఏర్పాటు చేసుకునే గ్రామీణ పేదలకు అందుబాటులో లేకుండా పోయింది. రాష్ట్రంలో 2100 పశువైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంవత్సరాల తరబడి వాటిని భర్తీ చేయకపోవడం వల్ల పశువైద్యం అందుబాటులో లేక పోతుంది.మందులు కొనుగోలు చేయడానికి అదనంగా నిధులు లేవు. కాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులు భర్తీ చేయడం లేదు. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి నిరుడు రూ.171.72 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్ లో రూ.154.54 కోట్లు మాత్రమే కేటాయించారు. గతం కంటే ఈ ఏడాది రూ.18 కోట్లు కోతపెట్టారు.2013 సంవత్సరం నుండి ఇంటర్నషీప్ స్టైఫండ్ పెంచాలని, వెటర్నరీ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని పశువైద్య విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కనీసం ఈ బడ్జెట్లో స్టైఫండ్ పెంచడానికి నిధులు కేటాయించకపోవడం బాధాకరం.
పాడి పరిశ్రమ అభివృద్ధికి, సహకార రంగాన్ని బలపరచడానికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం లోప భూయిష్టం. ఉద్యానవన శాఖకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెబుతూనే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భారీగా నిధులు తగ్గించారు. గత సంవత్సరం రూ.3469.47 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం రూ.930.8 కోట్లకు మాత్రమే సరిపుచ్చారు. మాటలకు చేతలకు పొంతనే లేదు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతోంది. డ్రిప్పు లేదు స్పింకర్స్ లేవు అన్ని కాగితాలకే పరిమితం అవుతున్నాయి
.మత్స్యశాఖకు గతేడాది రూ.521. 34 కోట్లు నుంచి రూ.540.19 కు పెంచారు.పెరిగిన ఈ స్వల్ప నిధులతో ఆక్వారంగంలో అద్భుతాలు సాధిస్తామని చెప్పటం బూటకం. ఎదుగు బొదుగు లేని పట్టు పరిశ్రమకు నిధులు పెంచుతారేమోని ఆశించిన పట్టు రైతులకు నిరాశే మిగిలింది.గత సంవత్సరం రూ.108 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ.12కోట్లు కోతకోసి రూ.96 కోట్లు కుదించారు.
సహాకారశాఖకు గతాడాది రూ.308 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ. 239.8 కోట్లకు తగ్గించారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.7241 కోట్ల నుండి రూ.12,773 కోట్లకు పెంచారు.నీటి వనరుల నిర్వహణ శాఖకు గత ఏడాది రూ.14637 కోట్లు నుంచి రూ.12903 కోట్లు తగ్గించారు.ఉపాధి హామీకి గతేడాది రూ.5150 కోట్ల నుంచి రూ.6026 కోట్లు పెంచినప్పటికీ ఈ నిధులు మెటీరియల్ కాంపోనెంట్ కు ఎక్కువగా పోతున్నాయి. వ్యవసాయ కూలీలకు పనిదినాలు తగ్గిపోయి వేతనాలు కూడా దిగజారి పోతున్నాయి. ఈ పెంపు వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి రూ.38 కోట్లు గత ఏడాది కేటాయిస్తే ఈ సంవత్సరం పెద్దగా మార్పు లేదు. ఎన్జీరంగా యూనివర్సిటీకి గత సంవత్సరం రూ.570 కోట్ల కేటాయిస్తే ఈ సంవత్సరం కూడా అదే మొత్తానికి సరిపోతుందన్నారు. వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీకి గత సంవత్సరం రూ.102 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం రెండు కోట్లు తగ్గించి రూ.98 కోట్లకు సరిపుచ్చారు. ఈ విధంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటానికి గత బడ్జెట్ లో రూ.43402 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం రూ.48341.14కోట్లకు పెంచినట్లుగా చూపించారు. కానీ ఇది ఖర్చు చేస్తారని గ్యారెంటీ లేదు. గతానికి ఇప్పటికీ పెరిగిందని చెబుతున్నా మధ్యలో సవరించకుండా కేటాయింపులను పూర్తిగా ఖర్చుపెడితే ఫలితం ఉంటుంది. లేకపోతే ఈ ఏడాది కూడా రైతాంగాన్ని మోసగించినట్లే అవుతుంది.

✍️✍️పి.జమలయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం