Breaking News

పెద్ద మనుషులుంటారు.. వారికి తల్లిపాలు కావాలి

.‘అయ్యా! ఏ తప్పూ చేయకపోయినా పోలీసులు నన్ను దోషిలా నిలబెట్టారు. నన్ను ఊరు విడిచి వెళ్లమంటున్నారు. కాస్త మీరు చెప్పండయ్యా! నా సమస్య తీర్చండయ్యా’ అని వేడుకుంటోంది లక్ష్మి. ‘అయ్యా.. కనికరించండయ్యా! నాకేమీ సాయం వద్దు. నేను వేశ్యను కాదని పోలీసులకు చెప్పండయ్యా. నా పరువు కాపాడండి’ అని గుండెలవిసేలా అడుగుతోంది. నిరుపేద ఇల్లాలు. భర్తకు అనారోగ్యం. ఏ ఆధారం లేని బడుగుతనం. ఎవరు వింటారు తన మాట? ఆ పెద్దమనుషులకు ఏం అవసరం ఉంటుంది తనతో? కొన్నాళ్లు.. కాదు కొన్నేళ్ల క్రితం మాత్రం తనతో అవసరం వచ్చింది. ఏంటా అవసరం? పాలు కావాలి. తన పాలు కావాలి. ఆ పెద్దమనుషుల పిల్లలకు ఆమె పాలు కావాలి. తల్లిపాలు చాలని పిల్లల కోసం మరో తల్లి అవతారం ఎత్తాలి. అందుకు లక్ష్మి అంగీకరించింది. అంగీకరించక ఏం చేస్తుంది? భర్త కూలీ. ఓనాడు పనిచేస్తూ పైనుంచి అమాంతం కిందపడ్డాడు. నడుము విరిగింది. కనాకష్టంగా నడుస్తున్నాడు. ఇక పనిచేయడం అతని వల్ల కాని పని. ఆ సమయానికి లక్ష్మి కడుపుతో ఉంది. భర్త కోసం వేదన పడి, ఆసుపత్రుల చుట్టూ తిరిగి, తిండి మానేసి.. వచ్చిన గర్భం పోయింది. ఏం చేస్తాం? విధిరాత అనుకుంది. కడుపులో బిడ్డ పోయినా, గుండెలో ఆ బిడ్డ తాలూకు గుర్తుగా పాలున్నాయి. అవేం చేయాలి? ఆ సమయంలోనే తనకో అవకాశం వచ్చింది. పెద్దింటి బిడ్డలకు పాలు పట్టే అవకాశం. అందుకోసం తనకు డబ్బులిస్తామన్నారు. భర్త లేచి పనిచేయలేని పరిస్థితిలో ఈ పని చేయక తప్పదు. ఒప్పుకుంది. తన గుండెభారాన్ని, ఇంట్లో భర్త ఆకలి భారాన్ని ఏకకాలంలో తీర్చుకుంది. కానీ ప్రకృతి అనేది భలే చిత్రమైనది. పాలివ్వడం తల్లి పని. కానీ ఆమె తల్లిగా ఉన్నప్పుడే అది చెల్లుతుంది. ఆ లెక్కన ఆమె గర్భం దాల్చాలి. భర్తేమో మంచానికి అతుక్కుపోయాడు. సంసారసుఖం దూరమైంది. ఇక గర్భమెలా వస్తుంది? మెల్లగా ఆమెను ఆ ‘పెద్దమనుషులు’ లొంగదీసుకోవడం మొదలుపెట్టారు. దాన్ని ఆమె వ్యభిచారం అనుకోలేదు. తన పనికోసం కావాల్సిన ఓ కార్యం అనుకుంది. గర్భం దాల్చింది కానీ, బిడ్డను కనలేదు. కంటే అటు భర్తకు, ఇటు సమాజానికి తను దోషిలా మారుతుంది. 18 ఏళ్ల కాలం గడిచింది. ఇప్పుడు పోలీసులు వచ్చారు. ‘నువ్వు వేశ్యవి’ అని ముద్రవేశారు. ‘ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లిపో’ అని హుకూం జారీ చేశారు. ఇంతమంది బిడ్డలకు పాలిచ్చి పెంచిన తాను వేశ్యనా అంటూ ఆమె మనసు కలత పడింది. ఎలా నిరూపించుకోవాలి తన నిర్దోషిత్వం? తాను పనిచేసిన ఒక్కో ఇంటికి వెళ్లింది. అడిగింది. బతిమాలింది. ఏడ్చింది. కానీ ఎవరూ పలకలేదు. ఒకనాడు ఆమె పాలిచ్చి పెంచిన పిల్లలు ఇప్పుడు మీసాలున్న ఆసాములయ్యారు. ఇంక ఆమెతో ఎవరికి ఏం పని ఉంటుంది? ఆనాడు ఆమెను వాడుకున్న పెద్దమనుషులకు ఇక ఆమె పాలతో ఏం పని పడుతుంది? అందరూ ముఖం చాటేశారు. మరీ గట్టిగా నిలదీస్తే, నడిరోడ్డు మీద నిలిచి ‘నువ్వు వేశ్యవేగా’ అని తేల్చేశారు.ఆమె గుండె ముక్కలైంది. ‘ఈ వేశ్య రొమ్ము పాలు తాగించే మీ బిడ్డల్ని పెంచారు కదరా నాయాల్లారా! ఈ వేశ్యను వాడుకుని మీ సరదాలు తీర్చుకున్నారు కదరా వెధవల్లారా! ఆనాడు చీకట్లో మీ ముఖం చూపించి, ఇవాళ వెలుగులో నన్ను వేశ్యను చేశారు కదరా పాపాత్ములారా!’ అంటూ వారి మీద దుమ్మెత్తిపోసింది. ఈ గొడవల్లో భర్త ఆరోగ్యం క్షీణించి అతను మరణించాడు. ఇక బతుకుపై లక్ష్మికి ఏదీ ఆశ? వేశ్యగా ముద్ర పడ్డ ఆమెను ఊరు బతకనిస్తుందా? పోపొమ్మని కనికరిస్తుందా? జాలి పడి ఆమెకు తిండి పెడుతుందా? ఏమీ చేయదు. చివరకు అవసరం లక్ష్మిని నిజంగానే వేశ్యగా మార్చింది. ఆ కూపంలోకి తోసింది. గాజుబొమ్మలా అలంకరించుకొని, అడ్డా మీద నిలబడి విటుల్ని ఆకర్షించే అంగడి సరుకైంది. ఆమె మీద మోహంతో వచ్చాడో యువకుడు. ఒకనాడు లక్ష్మి పాలిచ్చి పెంచిన వాడే, ఈనాడు ఆమెను పొందాలని వచ్చాడు. లక్ష్మి నవ్వుకుంది. జీవితం చేసిన మాయాజాలం చూసి ఏడుపు తన్నుకొచ్చేలా నవ్వుకుంది. 1989లో బెంగాలీ దర్శకుడు నబ్యేందు ఛటర్జీ తెరకెక్కించిన ‘పరశురామేర్ కుఠార్’(పరశురాముని గొడ్డలి) అనే సినిమా ఇది. సుబోధ్ ఘోష్ అనే బెంగాలీ రచయిత రాసిన బీభత్సమైన కథ దీనికి ఆధారం. సుబోధ్ రాసిన కథలు, నవలలు సినిమాలుగా తెరకెక్కాయి. హిందీలో బిమల్‌రాయ్ తీసిన ‘సుజాత’ సుబోధ్ కథ ఆధారంగా తీసిందే. ‘జ్ఞానపీఠ పురస్కారం ఇస్తాం తీసుకోండి’ అని కమిటీ ప్రతిపాదన చేస్తే, ‘పోనిద్దురూ.. నాకెందుకు ఆ పీఠాలు?’ అని నికార్సుగా తిరస్కరించిన వ్యక్తి సుబోధ్ ఘోష్.కుటుంబం గడవక పిల్లలకు పాలిచ్చి బతికే తల్లులుంటారని విన్నవారెందరు? వారిని చూసినవారెందరు? అటువంటి జీవితాన్ని సుబోధ్ ఘోష్ ఈ కథలో చిత్రించారు. ఆ తల్లి ఆ బిడ్డల తండ్రులకు విలాస వస్తువుగా మారాల్సిన అగత్యాన్ని ఇందులో చూపించారు. చివరకు సమాజం ఆమెకు వేసే ‘వేశ్య’ ముద్రనూ బీభత్సంగా కళ్లముందుంచారు. సినిమా కథావిధానం ఆసక్తికరంగా ఉంటుంది. లక్ష్మి పాత్ర పోషించిన నటి శ్రీలేఖా ముఖర్జీ ఎంత బాగా నటించారంటే, ఆమె తప్ప మరెవరూ ఈ పాత్ర వేయలేరు అన్నంతగా ఒదిగిపోయారు. అందుకే జాతీయ ఉత్తమ నటి పురస్కారం ఆమెను వరించింది. ఈ సినిమా యూట్యూబ్‌లో English Subtitlesతో అందుబాటులో ఉంది.-

లింక్: https://youtu.be/gG1N1YonlgE?si=IG-urh1wnqSa0uij

ఒక సోక్రటీస్‌.. ఒక భగత్‌ సింగ్‌

✍️✍️విశీ(వి.సాయివంశీ)

మేం తురకలమెట్లవుతం ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *