Breaking News

ఒక సోక్రటీస్‌.. ఒక భగత్‌ సింగ్‌

భగత్‌సింగ్‌ యువజన సంఘాలు వాడవాడలా వెలసిన దేశంలో ఇప్పుడు కులం, మతం, ప్రాంతం పేరిట విద్వేషాలు రాజేసి లక్షల కోట్లు దోచుకుంటున్న అవినీతి పరులు, నేరస్తుల పేరిట యువత తోక తగిలించుకున్న మూకలు కనబడుతున్నాయి. ఇంటర్మీడియట్‌ చదువుతున్న పిల్లల పరీక్షా కేంద్రాల గేట్ల వరకు వెంట వెళ్ళి పరీక్ష ఎలా రాయలో, రాసాక ఎక్కడ కలవాలో చెప్పే తల్లితండ్రులు, తలూపే పిల్లల్ని చూస్తుంటే వీళ్ల చదువుల్లో భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ అజాద్‌, జతిన్‌దాస్‌, రాంప్రసాద్‌ బిస్మిలా లాంటి వీరుల జీవితాల గురించి ఒక్క పేజి అయినా అర్ధం అయ్యేలా చదివించి ఉంటే దేశంలో ఇంతటి నైరాశ్యం, పిరికితనం ఉండేది కాదేమో అనిపిస్తోంది. ధైర్యం అంటే కలబడి తిట్టుకుని కొట్టుకోవడం కాదు. ఒక లక్ష్యం కోసం, ఒక సిద్ధాంతం కోసం నిలబడి పోరాటం చేయడం. తమ గురించి తమకు తెలియని ప్రజలను చైతన్యపరచడం. *ఉరికంటే పెద్ద శిక్ష* భగత్‌సింగ్‌ దేశ యువతకు స్ఫూర్తి కావాలనే మాటలు దశాబ్ధాలుగా వింటూనే ఉన్నాం అలాగే భగత్‌సింగ్‌ అంటే ఒక ఆవేశపరుడు, ఉద్యమకారుడు, విప్లవకారుడు అని జీర్ణించుకుపోయిన భావనలనూ చూస్తూనే ఉన్నాం. నాటి బ్రిటీష్‌ పాలకులు భగత్‌సింగ్‌ అతడి సహచరులను తీవ్రవాదులుగా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తే, నాటి జాతీయ నాయకులు వారిని కేవలం హింసా ప్రవృత్తి గల ఉద్రేకపరులుగా దేశానికి తెలియపరచే ప్రయత్నం చేసినట్లనిపిస్తుంది. ఇవి రెండూ భగత్‌సింగ్‌ని తీవ్రంగా అవమానించడమే. ఇలాంటి భావనలు, ప్రచారాలు బ్రిటిష్‌ వారు ఆ విప్లవ వీరులకు వేసిన ఉరిశిక్ష కంటే పెద్దవి. _23 ఏళ్లకే ప్రపంచ స్థాయి అలోచనలు_ మన పిల్లల పదవ తరగతి ఇంటర్మీడియట్‌ చదువుల వయసు నాటికి భగత్‌సింగ్‌ దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. దేశానికి స్వాతంత్య్రం బిక్ష కాదు హక్కుగా భావించాలని పిలుపిచ్చాడు. స్వాతంత్య్రం వచ్చి తీరుతుంది. కాని వచ్చాక దేశ విధానం, మార్గం సామ్యవాదం కావాలని, హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ను 17 ఏళ్ళ వయస్సులో స్థాపించాడు. శాండర్స్‌ హత్య, పార్లమెంట్‌పై జరిపిన బాంబుదాడిని మాత్రమే గుర్తుపెట్టుకుని భగత్‌సింగ్‌కి ఒక తెలుగు లేదా హింది మాస్‌ సినిమా హీరో ఇమేజ్‌ని కట్టపెట్టి ఆకాశమంత విశాలమైన, సముద్ర మంత గంభీరమైన అతడి ఆలోచనలను, మేధాశక్తిని, ప్రపంచంలో జరిగిన, జరుగుతూ ఉన్న పోరాటాలపై అతడికున్న అంచనాలను విశ్లేషణా సామర్థ్యాలను విస్మరించేసారు. నిజానికి 23 ఏళ్ళ జీవితంలో భగత్‌సింగ్‌ వెలిబుచ్చిన అభిప్రాయాల, ఆలోచనలు ప్రపంచస్థాయి ఉద్యమ నాయకులుగా గుర్తింపు పొందిన లెనిన్‌, స్టాలిన్‌, హాచిమిన్‌ వారి తర్వాత వచ్చిన కాస్ట్రో, చేగువేరా స్థాయిలో ఉన్నాయి *విప్లవానికి సరికొత్త నిర్వచనం* విప్లవం అంటే ఏమిటో, విప్లవం వర్ధిల్లాలి అని నినాదాలిప్పిస్తున్న కమ్యూనిస్ట్‌ పార్టీ వృద్ధ నాయకులను, ఇస్తున్న కార్యకర్తలని అడిగి చూడండి, చెప్పగలరేమో! కానీ విప్లవం అంటే రక్తపాతం, వ్యక్తులపై కక్ష సాధించడం, బాంబులు పిస్తోళ్ళకు సంబంధించినది కాదు. విప్లవం అంటే మెరుగైన స్థితికోసం మార్పుకి సిద్ధపడడం, మామూలుగా మనుషులు ఒక తరహా జీవితానికి అలవాటుపడి ఉంటారు దానిలో ఏదైనా మార్పు అంటే వణికిపోతారు. ఇదిగో ఈ బద్ధకపు భావన స్థానే ఒక స్ఫూర్తిని నింపడమే విప్లవం అని భగత్‌సింగ్‌ ఒక పత్రిక సంపాదకుడికి ఉత్తరం ద్వారా తెలిపాడు. అసలైన భగత్‌ సింగ్‌ని మనం తెలుసుకోవాలంటే భగత్‌సింగ్‌ మిత్రులకు పంపించిన సందేశాలు, ఉత్తరాలు, జైలు డైరీ చదవాల్సి ఉంటుంది. జైలు నిబంధనల కారణంగా భగత్‌సింగ్‌ వాటిని ఒక క్రమ పద్ధతిలో రాసుకునే అవకాశం లభించలేదు. అవి చూస్తే వాటిలో భారతదేశ పరిస్థితులతో పాటు, ప్రపంచ గమనం గురించి రాసుకున్నట్లు అర్థమవుతుంది. అంతకుముందు జాతీయ ఉద్యమ నాయకులు భారతదేశమే ప్రపంచ వైరుద్యాలన్నింటికి కేంద్రంగా భావిస్తే భగత్‌సింగ్‌ ఆ పరిమితమైన భావనల్ని అధిగమించి మొత్తం ప్రపంచ అభివృద్ధి పరిస్థితుల పరిధిలోనే భారతదేశ సమస్యలు పరిష్కరించబడతాయని అర్థం చేసుకున్నాడు. సోషలిజం, కాపిటలిజం, కమ్యూనిజం, మతం, దేశం, మార్కిజం, ఫ్రెంచి విప్లవం లాంటి అంశంపై భగత్‌సింగ్‌ రాసుకున్న నోట్సును ఆయన మరణం తరువాత కుటుంబ సభ్యులకు అందచేసారు. వాటిలో రాతలు వాటి వెనుకున్న తీవ్రమైన ఆలోచనలు ఆ యువ విప్లవకారుడి అద్భుతమైన అంతరంగిక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. కారాగారపు గోడల మధ్య ఆయన విజ్ఞాన సముపార్జనకై ఎంతగా తపించిందీ మన కళ్ళముందు ఆవిష్కృతమవుతుంది.మనకు మనమే పోరుకు అడ్డంకిగా మారవద్దు దోస్తావస్కి, బైరన్‌, విట్‌మిన్‌, వర్డ్స్‌వర్త్‌, ఇబ్బెన్‌, విక్టర్‌ హ్యుగోలీ, వీరిఫింగర్‌, ఎన్‌మార్జోన్‌, ఉమర్‌ఖయ్యాం లాంటి విఖ్యాత రచయితల రచనల నుంచి ముఖ్యమైన విషయాలను నోట్సుగా రాసుకున్న భగత్‌సింగ్‌ను పరిశీలిస్తే కోర్టుతీర్పు కోసం ఎదురుచూస్తూనే ఎంతగా శోధించాడో అర్థమవుతుంది. అంతేకాదు కేసు విచారణలో సమర్ధంగా తన వాదనలు వినిపించేందుకు న్యాయశాస్త్రం కూడా చదివాడు. పూర్తి నైరాశ్యంలో నాటి దేశయువత ఉన్నప్పుడు అనేక మాసాల కఠిన శ్రమ ద్వారా విప్లవకారులను సంఘటిత పరిచాడు, ప్రణాళికా వ్యూహాలు రచించాడు. ఆయుధాలు సేకరించి విజయం సాధించే సమయాన పెద్ద ఎదురుదెబ్బ తగిలినా తట్టుకుని నిలబడి’’ పరాజయాలకు తలవంచి కూలబడితే మనం ప్రయాణించే మార్గమే మూసుకుపోతుంది. అప్పుడు మనం దారిలోనే అడ్డంకులను తొలగించి ముందడుగు వేయడానికి బదులు మనమే ఇతరులకు అడ్డంకుగా తయారవుతాము’’ అని సహచరులను సమావేశపరచి చెప్పాడు. భగత్‌సింగ్‌ జీవితంలో ఇలాంటి ఉత్తేజకరమైన మాటలు ఎన్నో ఉన్నాయి. అందుకే అతడి జీవిత చరిత్ర వందల వ్యక్తిత్వ వికాసాలు, విజయ మార్గాల పుస్తకాలకు సమానం అనేది. *మరణానికి ముందు* సోక్రటీస్‌లానే భగత్‌సింగ్‌ ! ప్రపంచ తత్వవేత్తల్లో ప్రధముడు, ప్రముఖుడుగా పేరు గాంచిన సోక్రటీసు తన ప్రసంగాలతో యువతను చెడగొడుతున్నాడనే ఆరోపణలతో జైల్లో బంధించారు. అక్కడకు అందరూ వచ్చి చూసి వెళుతున్నా, శిష్య బృందం కన్నీరు పెడుతున్నా ఆయన అవేమీ పట్టనట్లు అందర్ని పలకరిస్తూనే ఉన్నారు. మరణం అంటే లెక్కపెట్టని ఆ మహనీయుడిని చూసి వారు విస్తుపోయారు. మరణశిక్ష అమలుకు రెండు గంటలు సమయం ముందు జైలు బయట ఒక బిక్షగాడు లైర్‌ వాయిద్యం వాయిస్తూ పాడుతున్న పాటను విన్న సోక్రటిస్‌ జైలు అధికారులను అభ్యర్థించి ఆ బిక్షగాడిని తన వద్దకు పిలిపించుకుని ఆ బిక్షగాడిని అడిగి అతని దగ్గర లైర్‌ వాయించడం, పాట పాడడం నేర్చుకున్నారు. మరణానికి చేయంత దూరంలో తనున్నా చెదరని ఆయన ధీరోధాత్తతను ప్రపంచం కొనియాడిరది. భగత్‌సింగ్‌ జైలు జీవితంలో ఇలాంటి సన్నివేశాలు ప్రతినిత్యం జరిగాయి. మరణశిక్షకు ముందురోజు మిత్రుడు ప్రాణనాధ్‌ ద్వారా తెప్పించుకున్న జర్మన్‌ మార్కిృస్టు క్లారా జట్కిన్‌ రాసిన రెమినిసెస్సెస్‌ ఆఫ్‌ లెనిన్‌ పుస్తకాన్ని రాత్రంతా చదువుతూనే ఉన్నాడు. ఉరితీయడానికి తీసుకెళ్తున్న అధికారులు భగత్‌సింగ్‌ చేతులు కట్టబోతే అక్కర్లేదు ధైర్యంగా నడవగలనన్నాడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు కానీ తమ చావు ఎప్పుడు ఏ క్షణాన ఉండబోతుందో తెలిసినా ప్రాణంకోసం ఎందులోనూ రాజీపడక, తల వంచక చివరి క్షణం వరకూ జీవితాన్ని ఆస్వాదించిన అరుదైన ధీరుల్లో భగత్‌సింగ్‌ ఒకడు. అతడి సాహసాలు, త్యాగాలే కాదు ఆలోచనలు ఆశయాలు ఇంకా ఎంతో గొప్పవి. రాంప్రసాద్‌ బిస్మిల్‌, జతిన్‌దాస్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు ఇంకా ఇతర విప్లవ వీరులకు నివాళులు

. (నేడు షహిది దివస్‌ సందర్భంగా)

పెద్ద మనుషులుంటారు.. వారికి తల్లిపాలు కావాలి

✍️✍️నరసింహ ప్రసాద్‌ గొర్రెపాటి–94407 34501

మేం తురకలమెట్లవుతం ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *