నిత్యం ఉపాద్యాయ విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న అశోక్ కుమార్ – నర్సిరెడ్డి లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలిపించండి.. ఓటర్ల ఆత్మగౌరవాన్ని కాపాడండి ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల సంయుక్త ప్రకటన రాష్ట్రంలో ఈనెల 27న జరగబోతున్న శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్ యర్రగుంటను, వరంగల్-ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి లకు మొదటి ప్రాధాన్యత ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు కోరాయి. ఈ ఎన్నికల్లో ఓటర్ల ఆత్మగౌరవాన్ని కాపాడాలనీ, ప్రలోభాలకు లోనుకావొద్దని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నాయకులు చావ రవి, ఎ వెంకట్ (టీఎస్ యూటీఎఫ్), సిహెచ్ అనిల్ కుమార్, ఎస్. తిరుపతి(టీపీటీఎఫ్), కొప్పిశెట్టి సురేష్, వస్కుల శ్రీనివాస్ (టీజీజేఎల్ఎ), మామిడి నారాయణ (గురుకుల జేఏసీ), ఎం రామేశ్వర్ రావు, శ్రీధర్ కుమార్ లోథ్ (టీఏయూసీటీఏ), జి భాస్కర్, టి నవీన్ (టీపీఎల్డీ), బి కొండయ్య, ఎస్ మహేశ్ (టీఎస్ఎంఎస్టీఎఫ్), ఎస్ శ్యామ్ కుమార్, ఎన్ ముత్తయ్య (టీ గురుకులం), శాగ కైలాసం, చింతా రమేష్ (ఎస్సీ,ఎస్టీటీయూ), జాదవ్ వెంకట్రావు, దూడ రాజనర్సు బాబు (ఎస్సీ, ఎస్టీటీఏ), జాడి రాజన్న, మేడి చరణ్ దాస్ (ఎస్సీ,ఎస్టీటీఎఫ్), మహమ్మద్ మసూద్ అహ్మద్, ముజిబుర్ రహమాన్ (టీయూటీఎ), కె సంజీప్, ఎ పద్మ (టీఆర్ఐటీఏ), డి ఎల్లయ్య, ఎస్ శశిధర్ (సోషల్ వెల్ఫేర్), బి సురేంద్ర, వి హరీందర్ రెడ్డి (ట్రైబల్ వెల్ఫేర్), జి రాంబాబు, ఎం మహేష్ (మైనార్టీ వెల్ఫేర్), ఎస్ సృజన, జి లివిన్ స్టన్ (బీసీ వెల్ఫేర్), కె విశాలాక్షి, సిహెచ్ లక్ష్మి, ఎం మంజుల (కేజీబీవీ), ఎ వేదాంతచారి, ఎం ప్రసన్న (ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్), పి సత్యం, ఆంజనేయులు (డాక్టర్స్ అసోసియేషన్), ఎస్ శంకర్, ఆర్ లాలు (పీడీ అండ్ పీఈటీ అసోసియేషన్) సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అవినీతిపరులకు, అవకాశవాదులకు, రియల్టర్లు, కార్పొరేట్ విద్యావ్యాపారులకు ఉపాధ్యాయ నియోజ కవర్గాల్లో స్థానం లేదని నిరూపించాలని కోరారు. సర్సిరెడ్డి, అశోక్ కుమార్ గెలిస్తేనే ఓటర్ గెలిచినట్లనీ, ఇంకెవరు గెలిచినా వారు వెంటనే అధికార పార్టీలో చేరిపోయే అవకాశవాదులేనని విమర్శించారు. విధాన పరిషత్ ఎన్నికల రంగంలో ముఖ్యంగా ఉపాధ్యాయ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఒకవైపు ఉపాధ్యాయ ఉద్యమాల్లో పనిజేసిన వారు .. మరొకవైపు విద్యావ్యా పారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీలో ఉన్నారు. మరొక పార్శంలో శ్రామిక వర్గాలకు చెందిన వారు, శ్రమను దోచుకొని సంపన్నులైన వారి మధ్యన పోటీ జరుగుతోంది. ఓటర్లు ఎటువైపు నిలబడా లో ఆలోచించాలి.అసలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల బాధ్యత ఏమిటి? రాష్ట్రం లోని విద్యా విధానం విద్యార్థులను సమాజ ప్రయోజ నాలకు అనుగుణంగా తీర్చి దిద్దే విధంగా, పేద ధనిక భేదం లేకుండా అందరికీ సమాన మైన, నాణ్యమైన విద్యావకాశాలు అందించే కొరకు తాను ఏమీ చేస్తాడో తన మానిఫెస్టోలో చెప్పాలి. అందుకోసం ఇంతవరదాక తాను ఏమీ చేశాడో కూడా చెప్పాలి. అలాగే ఓట్లు వేసే వారు ఆ పోటీ చేస్తున్న అభ్యర్థి ఎటువైపు నిలబడి ఎవరి ప్రయోజనాలు కాపాడే కొరకు పనిజేస్తాడో కూడా పరిశీలించాలి. ఇప్పటి వరకు ఎన్నికల రాజకీయ పార్టీలు అన్నీ కూడా అవి జాతీయ పార్టీలు అయినా, ప్రాంతీయ పార్టీలు అయినా అవి కేవలం సంపన్న వర్గాల ప్రయోజనాలు, పెట్టుబడి దారీ కాంట్రాక్ట్ వ్యవస్థల ప్రయోజనాల కొరకే పనిజేస్తూ వస్తున్నాయి. నేను SC , BC అని చెప్పుకుంటూ ఆయా పార్టీల తరఫున నిలబడుతున్న వ్యక్తులు ఒకవేళ గెలిచినప్పటికి వారు ఆయా పార్టీల విధానాల మేరకే పనిజేస్తారు తప్పితే సామాన్య ప్రజల ప్రయోజనాలు వారి ఎజెండా కాజాలవు అన్న విషయం మనం గమనించాలి. వాళ్ళు ఎవరి పేరు జెప్పుకొని ఓట్లు అడిగి గెలుస్తున్నారు? గెలిచిన తర్వాత ఎవరి పాట పాడుతున్నారో! ఏ వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో గమనించి మన ప్రతినిధిని ఎన్నుకుందాం. కుల సంఘాల ప్రతినిధులు కూడా ఎలాంటి ప్యాకేజీలు మాట్లాడుకొని ఎలా అమ్ముడు పోతున్నారో గమనించి మనం నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే విద్యార్థులు అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందాలనే డిమాండ్ వైపు ఎవరు నిలబడుతారో, అన్ని స్థాయిల్లో ప్రస్తుతం పనిజేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులను ప్రభుత్వ రంగంలో విలీనం చేసేందుకు, మొత్తంగా విద్యారంగంలో పనిజెస్తున్న అధ్యాపకుల అందరికీ మెరుగైన జీవన ప్రమాణాల కోసం కృషి చేసే అశోక్ కుమార్ ను కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, నర్సి రెడ్డి గారిని నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి ఎన్నుకోవాలని కోరుతున్నాము. గత ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా యూఎస్పీసీ, ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉధృతంగా పోరాడామనీ, ఈ ప్రభుత్వం సమస్యలను పరిష్కరి స్తుందనే నమ్మకం ఉందని వారు తెలిపారు. లేదంటే పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రతినెలా మొదటి తేదీన వేతనాలు ఇస్తామన్న హామీ మోడల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీల్లో అమలు జరగడం లేదని పేర్కొన్నారు. రెండేండ్లుగా ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులు, సెలవు జీతాలు, మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్, జీఎల్ఐ తదితర బకాయిలు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ఈ-కుబేర్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ, కమ్యుటేషన్ తదతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడాది కాలంగా విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సర్వీసు నిబంధనలు రూపొందించి డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో, డైట్, బీఈడీ కళాశాల అధ్యాపకుల పదోన్నతులు చేపట్టాలని కోరారు. గురుకులాల పనివేళలను విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుకూలంగా శాస్త్రీయంగా నిర్ణయించాలని సూచించారు. కేజీబీవీ ఉద్యోగులకు పేస్కేలు ఇవ్వాలనీ, కేర్ టేకర్లను నియమించాలని తెలిపారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలను చెల్లించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

