మధ్య భారతంలోని బీజాపూర్లో నక్సలైట్ల పేరుతో ఆదివాసీలపై హత్యాకాండను నిలిపివేయండి!
200 సంవత్సరాలుగా ఆదివాసీ నాయకులు విప్లవోద్యమం సాధించుకున్న చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయండి!

బూటకపు ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించండి!! నిజనిర్ధాణను గావించండి!!!
సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్రకమిటీ కార్యదర్శి చంద్రన్న డిమాండ్
గత రెండు దశాబ్దాలుగా మధ్యభారతంలో కార్పోరేట్ల ప్రయోజనాల కొరకు ఆదివాసీలను తమ మాతృభూమి అయిన అడవులనుండి, గూడేల నుండి వెళ్ళగొట్టేందుకు భారత ప్రభుత్వం రకరకాల పేర్లతో కుట్రలకు పాల్పడుతోంది. ముఖ్యంగా గత రెండు నెలలుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుండి బయటకు వచ్చిన నాయకులు, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారంతో బిజెపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే పనిగా నక్సలైట్ల ఏరివేత పేరిట డజన్ల కొలది ఆదివాసీ గ్రామీణ ప్రజలను, యువకులను పెద్ద ఎత్తున హత్య గావిస్తున్నది.
నక్సలైట్ల ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తున్నట్లు చూపుకోవడానికి ఎస్ఎస్ఆర్, ఎకె-47 లాంటి అధునాతన ఆయుధాలు కుప్పలు కుప్పలుగా లభిస్తున్నట్లు పత్రికల్లో అదే పనిగా ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి అధునాతన ఆయుధాలు కుప్పలుగా దొరుకుతున్న సందర్భాలలో కూడా నక్సలైట్లే కుప్పలు కుప్పలుగా మరణించడం పోలీసులకు, కేంద్ర సాయుధ బలగాలకు అసలు ఏ నష్టాలు రానట్లు ప్రకటించుకోవడం; జరుగుతున్న ఎన్ కౌంటర్ల బూటకత్వాన్ని నగ్నంగా బయట పెడుతున్నది.
ఏరోజుకు ఆ రోజు జరుగుతున్న ఎన్ కౌంటర్లను చూపించడానికి అప్పుడప్పుడు ఎన్ కౌంటర్లలో మరణించిన ఆదివాసీలను 3, 4 రోజులకు, వారానికి ఒకసారి కుప్పలుగా శవాలను ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లలో అధునాతన ఆయుధాలు పెద్ద ఎత్తున లభిస్తున్నప్పటికీ మావోయిస్టు అగ్రనాయకులు చనిపోయినవారిలో లేకపోవడం గమనార్హమైన విషయం. మృతి చెందిన నక్సలైట్ల పేర్లను పట్టించుకోలేకపోవడం, శవాలను చట్టప్రకారం పోస్టుమార్టం చేయించకపోవడం, మృతి చెందిన వారి శవాలను వారి కుటుంబాలకు అప్పగించకపోవడం ప్రజా, పౌర హక్కుల సంఘాలను ఎన్ కౌంటర్ల ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకోవడం మొదలైనవన్నీ ఎన్ కౌంటర్ల ‘నిజాయితీ’ రహిత విధానాల్ని పూర్తిగా బట్టబయలు చేస్తున్నాయి. అందువల్ల ఎన్ కౌంటర్లన్నింటిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచేత తక్షణమే విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ మరోమారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
తక్షణమే మధ్యభారతంలో జరుగుతున్న ఈ హత్యాకాండను ఆపివేయాలనీ, ఆపరేషన్ కగార్ను వెనక్కి తీసుకోవాలని, రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామిక హక్కులను గౌరవించి, నిజాయితీగా అమలుచేయాలనీ బిజెపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు ప్రకృతి వనరులను, విలువైన ఖనిజ సంపదలను కట్టబెట్టే ప్రయత్నాలను విరమించుకునేలా సుప్రీంకోర్టు ఆదేశాలివ్వాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ కోరుతున్నది. ఆదివాసీలు తమ స్వయం పాలనకోసం 200 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఆదివాసీలు కట్టుకోవడానికి బట్టలేక, ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. వారిపై సరిహద్దుల్లో యుద్ధంలో పాల్గొనాల్సిన సైనిక విభాగాలను ప్రయోగించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం. నేడు మధ్య భారత్లో సాగుతున్న ఆదివాసీ ఉద్యమం 200 సంవత్సరాలుగా ఆదివాసీ ప్రజలు, యువకులు తమ హక్కుల కోసం సాగిస్తున్న ఉద్యమానికి కొనసాగింపు మాత్రమే. దీనిని కేవలం మావోయిస్టు ఉద్యమంగానో, మరొక రకంగానో పేర్కొంటూ ఆదివాసీ జాతి హననానికి పూనుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య. దీనిని మేధావులు, ప్రజాస్వామిక వాదులు, రాజకీయ ప్రముఖులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని, ప్రతిఘటించాలని, ఖండించాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ కోరుతున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలను వ్యతిరేకిస్తూ మధ్యభారత్లో ఆదివాసీల పోరాటాలను బలపరుస్తూ గ్రామ గ్రామాన తీర్మాణాలు, సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలు జరపాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ కోరుతున్నది.
విప్లవాభివందనాలతో …
చంద్రన్న
ప్రధాన కార్యదర్శి,
కేంద్రకమిటీ
సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ